TRENDING TECH NEWS
TELANGANA:
TELANGANA:
- ఆరు జిల్లాల్లో భారీ నిల్వలు
- వజ్రాల గనులకూ అవకాశం
- జోరుగా సాగుతున్న పసిడి అన్వేషణ
- వెలికితీతకు గనుల శాఖ నిర్ణయం
‘బంగారు’ తెలంగాణ.. మాటవరసకు కాదు! నిజంగానే బంగారు తెలంగాణ. ఆమాటకొస్తే వజ్రాల తెలంగాణ కూడా!! ఇన్నాళ్లూ మన రాష్ట్రం నల్లబంగారానికే ప్రసిద్ధి. కానీ.. పాలమూరు, గద్వాల, నాగర్‌కర్నూలు, వనపర్తి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో బంగారు గనులు, వజ్రాల నిక్షేపాలు ఉన్నాయి!! వాటిని వెలికితీయడంలో గనుల శాఖ సఫలమైతే బంగారు తెలంగాణ కల నిజంగానే సాకారమవుతుంది!!
ఆ మూడు జిల్లాలు
సూర్యాపేట, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో వజ్రాలు, బంగారం గనులే ప్రధాన ఖనిజంగా మారనున్నట్లు గనుల శాఖ అంచనా వేసింది. ఈ విషయాన్ని నివేదికలోనే ప్రస్తావించింది. అంటే ఈ మూడు జిల్లాల్లో బంగారం, వజ్రాల గనులే ప్రధాన ఆదాయ వనరుగా ఉంటాయని, ఇతర ఖనిజాల ద్వారా వచ్చే ఆదాయం కన్నా వీటి తవ్వకాల మీద వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుందని పరోక్షంగా చెప్పింది.
గని తవ్వాలా? వద్దా?
భూమ్మీద అన్నిచోట్లా బంగారం ఉంటుంది. సముద్రపు నీటిలోనూ ఉంటుంది. దాన్ని వేరుచేసి, వెలికితీయడానికి అయ్యే ఖర్చును బట్టి బంగారం గనిని తవ్వాలా? వద్దా? అని నిర్ణయించుకుంటారు. ఓపెన్ కాస్ట్ బంగారం గనుల్లో టన్ను మట్టిని వెలికితీసి, ప్రాసెస్ చేస్తే 1.5 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రావాలి. లేదంటే ఆ గని లాభదాయకం కాదు. భూగర్భ గనుల్లో అయితే టన్ను మట్టిని వెలికితీసి ప్రాసెస్ చేస్తే 8-9 గ్రాముల బంగారం రావాలి. అంతకన్నా ఒక్క గ్రాము తక్కువ వచ్చినా గని తవ్వడమే దండగ.
బంగారం నిల్వలున్న జిల్లాలు ఇవే..
1. పాలమూరు
2. వనపర్తి
3. నాగర్‌కర్నూల్
4. గద్వాల
5. నల్లగొండ
6. సూర్యాపేట
హైదరాబాద్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): బంగారు తెలంగాణలో బంగారు గనులున్నట్లు వెల్లడైంది. రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో బంగారం, వజ్రాల నిల్వలు ఉన్నట్టు గనుల శాఖ గుర్తించింది. వాటిని వెలికితీయడానికి ప్రయత్నాలను మొదలు పెట్టింది. ఈ ప్రయత్నాలు సఫలమైతే తెలంగాణ నిజంగానే బంగారంగా మారనుంది. తెలంగాణ గనుల శాఖ తాజాగా తన కార్యకలాపాలపై ఒక నివేదికను రూపొందించింది. ఈ నివేదికలో పలు అంశాలను ప్రస్తావించారు. భవిష్యత్తు కార్యక్రమాలను కూడా పొందుపరిచారు. ఈ నివేదిక ప్రకారం మహబూబ్‌నగర్, గద్వాల, నాగర్‌కర్నూలు, వనపర్తి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో బంగారం, వజ్రాల నిక్షేపాలు ఉన్నట్టు తేలింది. వాటిని వెలికి తీయడానికి సర్వేను నిర్వహించాలని నిర్ణయించారు. ఈ బాధ్యతను ఎన్‌ఎండీసీకి అప్పగించారు. మొదటి దశ కింద గద్వాల, వనపర్తి జిల్లాలోని బంగారం గనులపై సమగ్ర సర్వేను నిర్వహించాలని నిర్ణయించారు.
ఇప్పటికే ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. ఆత్మకూరు, ధారూర్ ప్రాంతాల్లో డ్రిల్లింగ్ నిర్వహించారు. డ్రిల్లింగ్ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం ఆత్మకూరు బ్లాకులో 60 పీపీబీ(పార్ట్స్ పర్ బిలియన్) నుంచి 1000 పీపీబీ వరకు బంగారం ఉన్నట్టు గుర్తించారు. గద్వాల జిల్లా చంద్రగడ్డ బ్లాకులో తవ్వకాలు నిర్వహించగా, బంగారు 25 పీపీబీ నుంచి 165 పీపీబీ వరకు ఉన్నట్టు గుర్తించారు. అయితే ఆయా ప్రాంతాల్లో ఏ మేరకు బంగారు, వజ్రాల వాల్యూ ఉందనే విషయంపై ఎన్‌ఎండీసీ సమగ్ర సర్వే పూర్తయిన తర్వాత తేలనుంది. అనంతరం ఈ గనుల నుంచి బంగారం వెలికి తీసే ప్రక్రియపై ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశం ఉంది.
రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏయే విలువైన మినరల్స్ ఉన్నాయనే అంశంపై జీఎ్‌సఐ నుంచి సమాచారాన్ని తీసుకున్నారు. ఈ సమాచారం ఆధారంగానే ఆయా ప్రాంతాల్లోని విలువైన ముఖ్యంగా బంగారం, వజ్రాల వంటి గనులపై అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న అనేక మినరల్స్‌ను పూర్తి స్థాయిలో వెలికి తీయాలని ప్రభుత్వం భావిస్తున్నది. వీటి ద్వారా భారీ ఆదాయాన్ని పొందాలని అంచనా వేస్తున్నది. ఇప్పటికే రాష్ట్రానికి బొగ్గు, లైమ్‌స్టోన్ వంటి గనుల ద్వారా భారీ ఆదాయం వస్తున్నది. పరిశ్రమలకు తగ్గట్టుగా ముడిసరుకును వెలికి తీయడం ద్వారా ఆదాయంతో పాటు, ఉపాధిని కూడా కల్పించవచ్చని అంచనా వేస్తున్నారు.
బొగ్గు ఆదాయాన్ని మించుతుందా?
గడచిన ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి 4848 కోట్ల రూపాయల ఆదాయం గనుల నుంచి లభించింది. అందులో 2400 కోట్లు కేవలం బొగ్గు నుంచే వచ్చింది. మరో 1557 కోట్లు ఇతర ఖనిజాల నుంచి, మిగిలింది ఇసుక నుంచి వచ్చాయి. ఇప్పటిదాకా తెలంగాణకు బంగారం, వజ్రాల గనుల ఆదాయం లేదు. వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయగల నాణ్యతలో బంగారం నిల్వలు దొరికితే దాని ద్వారా వచ్చే ఆదాయం బొగ్గు ఆదాయాన్ని మించిపోవడం సాధ్యమేనని అంటున్నారు
No comments:
Post a Comment
Thank u